Saturday, May 1, 2010

అనుకోకుండా ఒక రోజు

ఆహా.. ఇవాళేంటి అన్ని పనులు ఇంత ప్రశాంతంగా తొందరగా అయిపోతున్నాయ్ అని అనందపడిపోతూ వెయిటింగ్ లాంజ్ లో కూర్చున్నాను.
నా మానాన నేను ఐపాడ్ లో రమణ గోగుల రీమిక్స్ చేసిన మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్స్ వింటూ కూర్చున్నా (ఈ పాటలు కావాలంటే అయీడియ,రిలయన్సె కస్టమర్స్ ఏదో ఒక నంబర్ కి కాల్ చెయ్యండి మిగిలిన వాళ్ళు ఈ జన్మకి ఆ పాటలు వినే అద్రుష్టం లేదని సరిపెట్టుకోండి)


ఎవరో.. మాం..ఫ్రీక్వెంట్ ఫ్లయెర్స్ కోసం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చెయ్యటానికి ఒక సర్వే కండక్ట్ చేస్తున్నాం అంటూ ఆర్ నారాయణమూర్తి సినిమాలో జూనియర్.ఆర్టిస్టుల్లా ఉన్న ఒక గుంపు నా వెంట పడ్డారు(అందరూ ఎర్ర డ్రెస్స్లు వేసుకున్నారులే). నా మీద ఇంత దురభిప్రాయం వీళ్ళకి ఎందుకు కలిగిందా అని బాధపడ్డాను.అయిన వాళ్ళేం పట్టించుకోకుండా అడగటం మొదలుపెట్టారు.
1.మీ పేరేంటి?--ఏదోఒకటి


2.మీకు ఎరుపురంగిష్టమా?--అవ్దు(అవును+కాదు--సవర్ణ మాస సంధి)


3.గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి?---గ్లోబ్ లోపల వేడిగాలి నింపటం


4.మీ అమ్మమ్మగారికి హాట్ డాగ్ ఇష్టమా లేకపోతే ఫ్రాంకీ ఇష్టమా?


5.మీరు వేసుకున్న లివైస్ జీన్స్ కి రెసిషన్ కి ఎమైన సంబంధం ఉందంటారా? ఈలోపు బోర్డింగ్ టైం అయిందని వినిపించేసరికి గెంతుకుంటు నేను వెళ్ళిపోయాను.
సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండకూడదు,పొలిటీషియన్స్ స్థలాలకి బాగా దగ్గరలో ఉండాలి అనే రెండు ముఖ్యమైన విషయాలని ద్రుష్టి లో పెట్టుకుని మన గవర్నమెంట్ వాళ్ళు కట్టిన గాలిపోర్ట్ లో దిగాను.ఎప్పుడూ అనందంగా బరువు బాధ్యతలు మోస్తూ తిరిగే కన్వేయర్ బెల్ట్ ఆరోజు ఎందుకో కదలకుండ దిగులుగా పడుకుని ఉంది.ఈలోపు ఒక గాలిహోస్టెస్స్(గెస్ట్ అంటే అతిథి,హోస్ట్ అంటే ఏంటో నాకు తెలియదు)కన్వేయర్ బెల్ట్ రిపెయిర్లో ఉంది అని చాలా బాధపడుతూ చెప్పింది,అయ్యో మన హోం మినిస్టర్లా సెన్సిటివ్ అనుకుంటా రాజీనామా చేస్తుందో ఏం పాడో అనుకుంటుంటే పక్కన పెట్టిన లగేజ్ కనిపించింది.అది పుచ్చుకుని అత్తయ్య చేసే మామిడికాయ పప్పు,వడియాలు తలుచుకుంటూ బయటకి వచ్చాను.
ఎలాగొలా హస్తమశకాంతరం ఇంటికొచ్చాను.ఆ మరుసటి రోజు ఏదో శెలవు అందరికీ ,నాక్కాదులే.అంతే ఎవరింటికో వెళ్ళటానికి ప్రోగ్రాం పెట్టారు అందరూ కలిసి.నాకిలా హనుమజ్జయంతికి,హయగ్రీవ వర్ధంతికి సెలవలు ఉండవని చెప్పి ఒప్పించేసరికి తల ప్రాణం మోకాల్లోకి వచ్చేసింది (అంటే కాట్ ఎగ్సాం రాయాలని నేను అలా డిసైడ్ అవ్వగానే నా మెదడు వెళ్ళి ఇలా సెటిల్ అయిందన్నమాట.)
ఆ నెక్స్ట్ రోజు లంచ్ బాక్స్ ఊపుకుంటూ అఫీస్ కెళ్ళాను.


ఉన్న జనాలందరితోను ఉప్పరి మీటింగ్ జరిగింది.నన్ను ముంబై లో జనాలు ఎందుకు తోలేశారో అన్నట్టుమొహం పెట్టుకుని కూర్చున్నారు అందరూ.నిన్నేగా జీతం వచ్చింది,ఇహ వెళ్ళి పని చేసుకుంటునట్టు ఏక్ట్ చేద్దాం అని పనులు మొదలుపెట్టాం. నేను నా బాక్స్ ఓపెన్ చేసి హస్తమసకాంతరం* కాకినాడ కాజా తినటం మొదలుపెట్టాను.(హస్తమసకాంతరం అర్థం తెలియని వాళ్ళూ కింద నోట్ చూడండి).ఇలా కొరికానో లేదో అలా ఒకటే సౌండ్స్ మొదలయ్యాయి.నేను కాజానే కొరికానా లేక కాజా లా మారువేషం వేసుకున్న ఏ బాంబు నో కొరికానా?లేక నా వేలు నేనే కొరుక్కుని నాలో ఉన్న అపరిచితురాలో,అంతరాత్మో అరిచారా లేక.......ఇలా లేకలు,లేకలు సాగి పోతుంటే రికార్డెడ్ వాయిస్ వినిపించింది
"అందరూ ముఖ్యమయిన కాగితాలు తీసుకుని కిందకు వెళ్ళి ఏడవండి బిల్డింగ్ కి నిప్పు అంటుకుంది"
నేను వెంటనే కాజా ల బాక్స్,వాటర్ బాటిల్ తీసుకుని లాప్టాప్ ,ఆడిట్ రిపోర్ట్స్ మీద మంచినీళ్ళ గ్లాస్ పెట్టి బయటికి బయల్దేరాను.అప్పటివరకు ముఖ్యమయిన కాగితాలు అంటే ఏంటో ఆలోచిస్తున్న వాళ్ళకి పిచ్చ క్లారిటీ వచ్చేసింది.అందరం పొలో మంటు బయటకి నడిచాం ముందు నేను వెనుక మా జనాలు.ఎలాగో కిందకి వచ్చి పడ్డాం.


తూచ్ ఇది ఫైర్ డ్రిల్ అంతే,మీ మీ సీట్లకి పోవచ్చు అని మళ్ళీ ఇందాకటి అమ్మాయే మర్యాదగా చెప్పింది.
ఎలాగో పైకి వచ్చి పడ్డాక ఈమాత్రం దానికి అనవసరంగ ఖంగారు పడ్డాం అని నాలో నేను అనుకున్నాను.నా పక్కన నడుస్తున్న మా డిపార్ట్మెంట్ మనిషి నన్ను దెయ్యంలా చూడటం మొదలుపెట్టారు.ఫైర్ డ్రిల్ టీం మెంబర్ అనుకుంటా,అతని సెంటిమెంట్స్ హర్ట్ చేసానేమో రేపు ఒక ఖండన ప్రకటన ఇద్దాంలే అని ఊరుకున్నా.ఈలోపు అతనే "మీరు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు మేడం?" అని అడిగాడు.చిన్నప్పుడే నేర్చుకున్నా అని చెప్పాను.అప్పుడు మీదే ఊరు అని అతను అడగటం విజయవాడ అని నేను చెప్పటం జరిగింది.అంతలో మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి అవునా మేమందరం ఇంకా గుజరాతీ ఏమో అనుకున్నాం అని రాంగోపాల్ వర్మ రీమేక్ చేసిన శంకరాభరణం సినిమా రిలీజింగ్ షో చూసొచ్చిన వాళ్ళలాగా మొహాలు పెట్టారు.ఆ మాటకి మనసు బాగా కష్ట పెట్టుకుని,అదీ కాక వాళ్ళ నమ్మకాన్ని దెబ్బ తీసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంటికి వెళ్ళాను.అన్నం తినేసి ఆరుబయట తెల్ల నీల్కమల్ కుర్చి వేసుకుని నా మొబైల్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అక్కడా ఇక్కడ అక్కడక్కాడ సెటిల్ అయ్యి,అలా సెటిల్ అయ్యేముందు నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరికి కాల్ చేసి ఆరోజు నేను తిన్న ముద్దపప్పు,మామిడికాయ పచ్చడి,నెయ్యి,అరటికాయ వేపుడు,పప్పుచారు,వడియాలు,పెరుగు గురించి(వాటి రంగు,రుచి,వాసన)వర్ణించటం మొదలుపెట్టాను .అలా వర్ణించి..ర్ణించి..ంచి ....వాళ్ళు పెడుతున్న శాపనర్థాలు వింటూ తిడుతున్న తిట్లు తింటూ అనందంగా నవ్వుకుంటూ హస్తమసకంతరం నిద్రపోయాను.
నోట్:హస్తమసకాంతరం అంటే ఏంటొ నాక్కూడా తెలియదు,పదం బాగుందని వాడా.ప్లీజ్ నాకు అర్థం చెప్పొద్దు.అర్థం తెలిస్తే అవసరం ఉన్నప్పుడే వాడాలి.అసలు అవసరం వస్తుందో రాదో కూడా తెలియదు.అర్థం తెలియకుండా అయితే రాజకీయనాకులు రెండో ఎస్సార్సీ వాడినట్టు ఎప్పుడు పడితే అప్పుడు వాడొచ్చు.


5 comments:

 1. Mahitha..ne article ippude chadiva ra... article bagundi... hastamasakantaram ante naku teledu sare kane last lo meaning chuddam ani note chusa... meaning super .. nuvvu elane manchi manchi artciles rayali ani akankshithu .....

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. Mahi గారూ...,

  నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
  ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
  నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
  మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

  తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
  తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
  హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

  - హారం ప్రచారకులు.

  ReplyDelete
 4. Happy English New Year..!!!

  Please continue writing.

  ReplyDelete