Wednesday, February 11, 2009

డ్రాయింగ్ క్లాసు

మాకు ఇంజినీరింగ్ లో డ్రాయింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది.అసలు నాకు బొమ్మలు వేయటం అంటే పెన్సిలేజ్ (పెన్సిల్ తో రాసుకునే ఏజ్)నుంచే చిరాకు.పైగా సరిగ్గా కాలని దోశెలా (తెల్లగాఉండేవారు మరి)మొహం పెట్టుకుని వచ్చేవారు ఆ లెక్చరర్. అయినా నేను వేసిన బొమ్మలు "చాలా డిఫ్ఫెరెంట్గా ఉండేవి" (ఇప్పుడె ఇంటర్నెట్ లో ఈనాడు పేపర్-చిత్ర వార్తలు చూసాను)అంటే,

స్క్వేర్ --> సమోసా లా

ట్రైయాంగిల్ --> సరిగ్గా కట్ చేయని ఢోక్లా లా

పెంటగాన్ --> ఫైవ్ స్టార్ హోటల్ దోశె లా

రెక్టాంగిల్ --> మిరపకాయ బజ్జీ లా

ఇలా చాలా క్రియేటివ్ గా డ్రా చేసేదాన్ని.అందుకే లెక్చరర్‌కి నేనంటే చాలా భయం ఉండేది.

ఇలా ఆనందంగా బొమ్మలు వేసుకుని డ్రాయింగ్ క్లాస్ లో నుంచి బయటకి వస్తున్న నాకు మా ఫ్రెండ్స్ నోటీస్ బోర్డ్ చూపించారు.


Student are requested to submitt,
1.------
2.------
3.------
4.------- etc.. etc..

by next class.

నేను వెంటనే నా డ్రాయింగ్ షీట్స్ లో ఉన్న ఆహార పదార్థాల వైపు చూసాను.ఇంటికెళ్ళాక ఎలా అయిన వాటి పని చూద్దాం అని నిర్ణయించుకున్నా.
*******************************************************************************
ఇంటికి వెళ్ళి
నేను:అమ్మా! రేపు సబ్మిషన్ ఉంది హెల్ప్ చేస్తావా?( ఏదో పెన్సిళ్ళు చెక్కి ఇవ్వటం లాంటివి)
అమ్మ:జలుబు చేసి హోం వర్క్ చెయ్యలేకపోయావని లెటర్ రాసి ఇవ్వనా?


సరేలే ఇలాంటి టెంప్టేషన్స్ కి లొంగకూడదు అని కాసేపు నన్ను నేను మోటివేట్ చేసుకుని,పెన్సిళ్ళు చెక్కుకుని ఎరేజర్ కోసం వెతకటం మొదలుపెట్టాను కనపడలేదు ఇంటి పక్కన చిన్న బాబు ని అడిగితే ఎర్ర రంగులో పైనాపిల్ లా ఉన్న ఎరేజర్ ఇచ్చాడు.హమ్మయ్య అనుకుని డ్రాఫ్టర్ డైనింగ్ టేబుల్ కి సెట్ చేసాను.అప్పుడు గుర్తొచ్చింది డ్రాయింగ్ షీట్స్ లేవని,నాన్న కి కాల్ చేసాను.

నేను: హలో
నాన్న: చెప్పమ్మా వచ్చేసావా కాలేజ్ నుంచి?పాలు తాగావా?

నేను:హా తాగేసాను.మీరు ఇంటికెప్పుడు వస్తారు?
నాన్న:టైం పడుతుంది బంగారం ఏమైనా పనుందా?

నేను: డ్రాయింగ్ షీట్స్ కావాలి....
నాన్న:నేను పంపిస్తాలే డబుల్ రూల్స్ ఉన్నవా? ఫోర్ రూల్స్ ఉన్నవా?

నేను:......
నాన్న:ఇంగ్లిష్ రాయటానికా?తెలుగు రాయటానికా?

నేను:.... ఏమి లేదులే నాన్న.మళ్ళీ కాల్ చేస్తాను అమ్మ పిలుస్తోంది.
ఏంటో మొదలుపెట్టిన టైం బాలేదు అనుకున్నాను.

ఈలోపు మా ఇంటిదగ్గర ఉండే మా ఫ్రెండ్ కాల్ చేసింది ఊరికే మాట్లాడదామని పనిలో పనిగా డ్రాయింగ్ అంటే ఏంటి అనే చిన్న డౌట్ కూడా అడిగింది.ఇక్కడికేరా ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం అన్నాను.

అంతే,

ఫ్యామిలి షిఫ్టింగ్ అంత లగేజ్ తో వచ్చేసింది. :(

తన దగ్గర ఉన్న షీట్స్ తో వర్క్ మొదలుపెట్టాం.

మద్యలొ మా ఇంటిపక్కన బాబుని,వాళ్ళమ్మని,మా అమ్మమ్మని,మా పనమ్మాయిని స్కేల్ సరిగ్గా ఉందా? పెన్సిల్ గీత బాగా వచ్చిందా అని అడుగుతూ, మా బొమ్మలకి (మేం గీసిన బొమ్మలకి)మేమే మురిసిపోతూ ఎలా అయితే పూర్తి చేసాం.

తర్వాత రోజు ఇద్దరం కలిసే వెళ్ళాం కాలేజ్ కి.

మా ఫ్రెండ్ బండి సరిగ్గా పార్క్ చెయ్యలేదు.వెంటనే నేను "నువ్వు మనిషివా?మురళి మోహన్ వా అన్నాను?"(మా డ్రాయింగ్ సర్ పేరు అదే)

నా తెలివితేటలకి,సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి,స్పోంటేనిటికి వగైరాలకి మురిసిపోతూ పక్కకి తిరిగాను అక్కడ మా సరిగ్గా కాలని దోశె....(మా డ్రాయింగ్ సర్)

అయిపోయింది............

(నాలో నేను-మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి అరంజ్మెంట్స్ చేసుకోవాలి,టిసి తీసుకోవాలి,ఫ్రెండ్స్ కి బై చెప్పాలి,ఆటోగ్రాఫ్ బుక్ రాయించుకోవాలి అని ఒక టు-డు లిస్ట్ తయారుచేసుకున్నాను)

ఎలాగో ధైర్యం చేసి క్లాస్ కి వెళ్ళాం.ఒక్కొక్కరిని పిలిచి చెక్ చేస్తున్నారు,నేను దేవుడికి దణ్ణం పెట్టుకుని వెళ్ళాను.నేననుకున్నంత వయొలెంట్‌గా ఏమీ అనలేదు కాని ఇదేంటి రెక్టాంగిల్ లో అన్ని సైడ్స్ ఈక్వల్‌గా లేవు లాంటి ప్రశ్నలు అడిగారు.

ఎలా అయితే నా ఫర్స్ట్ సబ్మిషన్ పూర్తి అయింది.నా ఫ్రెండ్ ని మాత్రం చాలా తిట్టారు.ఫైనల్ గా అర్థమయిందేంటంటే ఆయన్ని కామెంట్ చేసింది మా ఫ్రెండ్ అనుకున్నారు.
అలా నా ఇన్నోసెంట్ ఫేస్ నన్ను కాపాడింది.పాపం మా ఫ్రెండ్.

("బ్లాగ్ లో రాస్తున్నా అని చెప్తే పేరు రాయకు ప్లీజ్.నేను డ్రాయింగ్ లో ఫెయిల్ అయిన సంగతి అందరికి తెలిసిపోతుంది అంది")

Thursday, February 5, 2009

ముంబై

నేను ఒక ప్రోజెక్ట్ వర్క్ కోసం 3 నెలలు ముంబై లో ఉన్నాను.నాకు అన్నిటికంటే బాగా గుర్తుండిపోయింది మాత్రం లోకల్ ట్రైన్

రైల్వే స్టేషన్ బయట ఆటో దిగగానే ఏదో జాతరకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది.తల పైకెత్తి చూడగానే రాజ్ థాకరే నవ్వుతూ కనిపిస్తాడు (పొస్టర్‌లో).ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే గవర్న్మెంట్ కి ఎక్స్ట్రా టాక్స్ కట్టాల్సివస్తుందేమో అన్నట్టు జనాలందరూ ఎక్కడికో ఒకచోటకి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారు.


ఒక అరగంట కష్టపడితే ఈజీగా 10 అడుగులు వెయ్యొచ్చు.కొంచెం ముందుకువెళితే స్టార్టింగే కానీ ఎండింగ్ కనిపించని క్యూస్ కనిపిస్తాయి.పక్కనే మెట్లు కూడా.ఒక 10 మెట్లు ఎక్కగానే ఆ ముందు రోజు రాత్రి అంతా పళ్ళు టక టక లాడించి రెస్ట్ తీసుకుంటున్న పంచ్ మెషీన్స్ కనిపిస్తాయి.ఆ పక్కనే నిద్రపోతున్న లేడీ కానిస్టేబుల్ని చూస్తే ముంబై అంత ప్రశాంతమైన నగరం ఎక్కడా లేదేమో అనిపిస్తుంది.


ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళగానే ముంబై అమ్మయిని అనిపించుకోవాలనే తొందరలో భయంకరంగా రెడీ అయిన అమ్మాయిలు కనిపిస్తారు. అయ్యో అడ్డమైన్ క్రీములు రాసి జుట్టు పాడైపోయిందని మనం బాధలో ఉండగానే అర్థం అయిపోతుంది అది వాళ్ళ హెయిర్ స్టైల్ అని.

ఈలోపు ఎదురుగా ఒక మామ్మగారు(అలా మమ్మగారు అని పైకి అంటే ఈవ్ టీజింగ్ కేస్ పెడతారు)హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఎదురు వస్తారు.అప్పుడు మన మొబైల్లో కుడా ఈ సౌకర్యం ఉన్న సంగతి గుర్తువస్తుంది.మనం వెంటనే మన మొబైల్ లో పాటలు వినటం మొదలు పెడతాం.


ఈలోపు ట్రైన్ అనౌన్స్మెంట్ ఔతుంది అంతే అప్పటివరకు చా..లా సొఫిస్టికేటెడ్ గా ఉన్నవాళ్ళంత ఒక్కసారే అరుచుకుంటూ ట్రైన్ ఎంట్రన్స్ దగ్గరకి పరిగెత్తటం మొదలు పెడతారు. ఎక్కేవాళ్ళూ దిగేవాళ్ళ మద్యలో ఇరుక్కుపోయి మనకి తెలియకుండానే ట్రైన్ లో వచ్చి పడతాం.

నేను ఒక విషయం అబ్సర్వ్ చేసాను ప్రతి కంపార్ట్‌మెంట్‌లోనూ అందరి మీదా అరిచే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వీళ్ళు జెనరల్‌గా నార్త్ ఇండియన్స్ అంటే ఇష్టం లేని మహరాష్ట్రియన్స్ అయి ఉంటారు. ఏదో ఒక స్టేషన్లో స్క్వాడ్ వచ్చేదాకా వీళ్ళని భరించాలి.స్క్వాడ్ వచ్చాక తెలుస్తుంది వీళ్ళకి టికెట్ లేని సంగతి.

ఈలోపు మనం దిగే స్టేషన్ వచ్చేస్తుంది హమ్మయ్య....
ముంబైలో ఉన్నన్ని రోజులు దేవుడా ఏం పాపం చేసుకున్నాను నాయనా అనుకునేదాన్ని.

ఫైనల్ గా నాకు తెలిసిందేంటంటే నేను,దోమలు,ఎండలు విజయవాడ లో ఉండటమే కరెక్ట్ అని. :)

కాని ముంబై- The city that never gives up.